Meta: టెక్ దిగ్గజం మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈసారి దాదాపు 8 వేల మంది ఉద్యోగులు లేఆఫ్స్ ప్రభావానికి గురైనట్లు సమాచారం. కంపెనీ ముందుగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చి, తర్వాత సైలెంట్‌గా తొలగింపులు చేపట్టిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తెల్లవారుజామునే లేఆఫ్స్ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. మొదటగా సింగపూర్ ఉద్యోగులకు నోటీసులు వెళ్లగా, అనంతరం అమెరికా, బ్రిటన్ ఉద్యోగులకు కూడా ఈ సమాచారం అందింది. తాజా విడతలో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిపై ప్రభావం పడినట్లు సమాచారం.
లేఆఫ్స్‌కు ముందు మెటాలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోతతో పాటు మరో 8 వేల మంది ఉద్యోగులను ఏఐ ఆధారిత విభాగాలకు బదిలీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
సంస్థ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గేల్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో, తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించే దిశగా సంస్థ మార్పులు చేసుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇంకా మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశముందని కూడా సమాచారం.
ఇటీవల మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, కంపెనీని పూర్తిగా ఏఐ కేంద్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. ఈ ఏడాది ఏఐ రంగంలో 145 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కూడా వెల్లడించారు.
ఇక లేఆఫ్స్ తప్పవని మెటా గత నెలలోనే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన, అసంతృప్తి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఉద్యోగుల కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలను సేకరించి ఏఐకి శిక్షణ ఇచ్చే కొత్త టూల్‌పై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ టూల్‌కు వ్యతిరేకంగా వెయ్యికి పైగా ఉద్యోగులు అంతర్గత పిటిషన్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం.
మరోవైపు, ఈసారి లేఆఫ్స్‌పై వ్యతిరేకత తగ్గించేందుకు ముందుగా ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం పేరుతో ఆఫీసుల నుంచి దూరం చేసి, తర్వాత తొలగింపులు చేపట్టినట్లు కొందరు ఉద్యోగులు భావిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
