Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన “ఆస్క్ మీ ఎనీథింగ్” సెషన్లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటరాక్షన్‌లో ఒక అభిమాని “మీలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు?” అని అడగగా, అన్నా స్పందిస్తూ “పవన్ గారే ముందుగా నాకు ప్రపోజ్ చేశారు” అని చెప్పారు. దీంతో వారి ప్రేమకథపై స్పష్టత రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భాషల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తనకు మొత్తం ఆరు భాషలు వచ్చని ఆమె వెల్లడించారు. అయితే మాట్లాడటానికి ఇంగ్లీష్ భాషే తనకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో తెలుగు భాషపై తనకు ప్రత్యేకమైన ఇష్టం ఉందని, ప్రతిరోజూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నానని తెలిపారు.
వంటల విషయానికి వస్తే, అన్నా లెజ్నెవా తన అత్తగారు అంజనా దేవి దగ్గరే చాలా వంటలు నేర్చుకున్నానని చెప్పారు. ప్రస్తుతం దోస, ఇడ్లీ, చట్నీలతో పాటు పప్పులు, కూరలు కూడా సులభంగా వండగలుగుతున్నానని తెలిపారు. అంతేకాకుండా గోంగూర, పాలక్ పనీర్, బిర్యానీ, చేపల పులుసు వంటి రుచికరమైన వంటకాలు కూడా తానే తయారు చేయగలనని చెప్పారు. ముఖ్యంగా శాకాహార వంటకాలపై తనకు మంచి పట్టు ఉందని పేర్కొన్నారు.
ఇక పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన వంటల గురించి మాట్లాడుతూ, అంజనా దేవి చేసే మసాలా చికెన్ కూర ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ వంటకం కూడా తాను అత్తగారి దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. అలాగే సురేఖమ్మ చేసే చేపల పులుసు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా తింటారని ఆమె వెల్లడించారు.
