Summer: వేసవి కాలం మరింత ముదిరిననప్పుడు, మనం ధరించే బట్టల రంగు కూడా చాలా ముఖ్యమవుతుంది. ఇది కేవలం ఫ్యాషన్ గురించి మాత్రమే కాదు, మన శరీరం వేడికి ఎలా స్పందిస్తుందన్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని రంగులు సూర్యకాంతిని ఎక్కువగా గ్రహించి, వేడిని నిల్వచేసి మనకు మరింత ఉక్కిరిబిక్కిరి అనిపించేలా చేస్తాయి. ఇప్పటికే ఎండలో బయటకు వెళ్లడం కష్టంగా ఉన్నవారికి.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులు ధరించడం వల్ల అసౌకర్యం మరింత పెరుగుతుంది.
ముఖ్యంగా నలుపు (బ్లాక్) రంగు దాదాపు అన్ని కాంతి తరంగాలను గ్రహిస్తుంది. అందుకే ఇది ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ వేడిని నిల్వచేస్తుంది. నలుపు రంగు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, తీవ్రమైన ఎండలో ఇది శరీరాన్ని ఎక్కువగా వేడి చేస్తుంది.

నేవీ బ్లూ, ఇతర డార్క్ బ్లూ షేడ్స్ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాయి. ఇవి నలుపు అంతగా కఠినంగా కనిపించకపోయినా, సూర్యకాంతిని ఎక్కువగా గ్రహించి వేడిని నిల్వ చేస్తాయి. కాబట్టి ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తే ఇవి సరైన ఎంపిక కావు.

గ్రే రంగు సాధారణంగా సేఫ్ ఆప్షన్‌లా అనిపించినా, ముదురు గ్రే షేడ్స్ కూడా వేడిని పట్టివుంచుతాయి. ఇవి సూర్యకాంతిని సరిగా ప్రతిబింబించలేవు కాబట్టి వేసవిలో ధరించినప్పుడు బట్టలు భారంగా అనిపించవచ్చు.

అలాగే మెరూన్, బర్గుండి వంటి గాఢ ఎరుపు రంగులు కూడా ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇవి స్టైలిష్‌గా కనిపించినా, ఎక్కువ ఉష్ణోగ్రతల్లో శరీరాన్ని మరింత వేడిగా అనిపించవచ్చు.

డీప్ పర్పుల్ ఇలాంటి గాఢ రంగులు కూడా వేడి ఎక్కువగా గ్రహించే వర్గానికి చెందుతాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఎండలో ఎక్కువసేపు ఉండాల్సినప్పుడు సౌకర్యవంతంగా ఉండవు.

మొత్తానికి, వేసవిలో గాఢ రంగుల కంటే తేలికపాటి రంగులను ఎంచుకోవడం మంచిది. ఇవి సూర్యకాంతిని ప్రతిబింబించి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.
