Snakes Village: పల్లెటూరు అంటే సాధారణంగా పచ్చని పొలాలు, పాడిపశువులు గుర్తుకు వస్తాయి. కానీ చైనాలోని జిసికియావో అనే గ్రామం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా పాములే కనిపిస్తాయి. సుమారు వెయ్యి మంది జనాభా ఉన్న ఈ గ్రామం పాముల పెంపకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఈ గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబం పాములను పెంచడం వృత్తిగా చేసుకుంటోంది. చిన్నా పెద్దా రకరకాల సర్పాలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. మొదట కొంతమంది గ్రామస్థులు సరదాగా పాములను పెంచడం ప్రారంభించారు. తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పాముల విషం, చర్మానికి ఉన్న భారీ డిమాండ్‌ను గమనించి, గ్రామంలోని చాలా మంది ఈ వ్యాపారంలోకి వచ్చారు.

పాముల పెంపకం ప్రమాదకరమైనదైనా, అదే వారి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ వ్యాపారం ద్వారా గ్రామస్థులు ఆర్థికంగా బాగా ఎదిగి, చాలా మంది కోటీశ్వరులయ్యారు. అయితే ఎవరైనా సరే ఈ వృత్తిలోకి రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రత్యేక శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందినవారికే పాములను పెంచేందుకు అనుమతి ఇస్తారు.
ఇక్కడ పెంచే పాముల్లో అత్యంత విషపూరితమైన సర్పాలు కూడా ఉండటం వల్ల భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తారు. ఆధునిక సాంకేతికతతో పాటు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తూ ఈ ప్రమాదకరమైన వృత్తిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
