Health Tips: ఈ రోజుల్లో చాలా మంది అజీర్ణం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి మందులపై ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని సాధారణ ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యలను నియంత్రించుకోవచ్చు. అందులో ముఖ్యంగా అల్లం ఎంతో ఉపయోగపడుతుంది.
అల్లం తాజాగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎండిన తర్వాత కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. సాధారణంగా మనం తాజా అల్లాన్ని వంటల్లో, టీ తయారీలో ఉపయోగిస్తాం. అయితే ఎండిన అల్లాన్ని చాలా మంది పారేస్తుంటారు. కానీ అది తప్పు. ఎండిన అల్లం (శొంఠి లేదా సౌంత్) కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
శొంఠి పొడిని చూర్ణంగా తీసుకోవచ్చు. దీన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే అర చెంచా అల్లం పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మార్నింగ్ సిక్నెస్, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. రుచికోసం కొద్దిగా తేనె కూడా కలపవచ్చు.
అజీర్ణం సమస్యతో బాధపడేవారికి అల్లం చాలా ఉపశమనం ఇస్తుంది. భోజనం ముందు కొద్దిగా అల్లం పొడి తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపులో ఉండే అసౌకర్యం, నొప్పి తగ్గుతుంది. దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలకూ ఇది మంచి పరిష్కారం.
ఇక అధిక కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరం. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. అల్లం పొడి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గేందుకు సహాయపడుతుంది.
తాజా అల్లం తీసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అల్లం కలిపిన టీ తాగడం మంచిది.
అంతేకాకుండా అల్లం జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను చెమట ద్వారా బయటకు పంపడంలో కూడా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, అల్లం మన రోజువారీ ఆహారంలో ఉండే ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.
