Ugadi 2026: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కొత్త సంవత్సరాన్ని “పరాభవ నామ సంవత్సరం”గా పిలుస్తారు. అయితే “పరాభవ” అనే పేరును విన్న వెంటనే చాలామందిలో సందేహాలు, ఆందోళనలు మొదలయ్యాయి. పరాభవం అంటే అవమానం, ఓటమి అని భావించి ఈ ఏడాది అంతా ఇబ్బందులేనా అని కొందరు అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే పండితులు చెప్పే అర్థం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. “పరాభవ” అనే పదాన్ని విడదీసి చూస్తే ‘పరా’ అంటే పరా భట్టారిక, అంటే అమ్మవారు (లలితాదేవి), ‘భవ’ అంటే పరమశివుడు. ఈ విధంగా పరాభవం అనేది పార్వతి-పరమేశ్వరుల అనుగ్రహాన్ని సూచించే పేరు అని భావిస్తారు. అంటే ఈ సంవత్సరం దివ్య దంపతుల కృపతో భక్తులకు రక్షణ, శుభఫలితాలు కలుగుతాయని అర్థం.
ఇంకా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా పరాభవానికి వేరే అర్థం ఉంది. ‘పరా’ అంటే గొప్పది, అత్యున్నతమైనది, ‘భవ’ అంటే స్థితి లేదా పుట్టుక. ఈ రెండింటిని కలిపితే “ఉన్నత స్థితిని పొందడం” అనే భావం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరాన్ని కేవలం అవమానం లేదా ఓటమిగా భావించడం సరైంది కాదు.
ఈ పరాభవ నామ సంవత్సరం తెలుగు పంచాంగంలోని 60 సంవత్సరాల చక్రంలో 40వది. ఈ సంవత్సరంలో జన్మించిన వారు లేదా ఈ కాలంలో పనులు చేసే వారు అహంకారాన్ని వదిలి వినయంతో ముందుకు సాగుతారని విశ్వాసం. అసలు పరాభవం అంటే అహంకారానికి ఓటమి, జ్ఞానానికి విజయం అనే భావనను సూచిస్తుంది.
ఈ సంవత్సరంలో ప్రజల్లో ధర్మంపై ఆసక్తి పెరుగుతుందని, కొత్త ఆలోచనలు, మార్పులకు శ్రీకారం చుడతారని పండితులు చెబుతున్నారు. అజ్ఞానంపై జ్ఞానం గెలిచే కాలంగా కూడా దీన్ని భావిస్తారు. జీవితం లో వచ్చే మార్పులు మనిషిని మరింత బలంగా, స్థిరంగా మార్చే అవకాశముంది.
గతంలో 1966-67 సంవత్సరంలో ఈ పరాభవ నామ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మళ్లీ 2026లో తిరిగి వచ్చింది. అందువల్ల భయపడకుండా, భక్తితో, సానుకూల దృక్పథంతో ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలనే సూచిస్తున్నారు.
Also Read: Ugadi 2026: ఆ 60 మంది పేర్లే తెలుగు సంవత్సరాల పేర్లు?
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం.. దీనర్థం అవమానాలు, ఓటములేనా..?
