VIRAL: రైల్లో ఆలయం ఉండటం ఎప్పుడైనా చూశారా? రైల్లో ఆలయం అంటే నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.. చాలామందికి ఇది నమ్మశక్యంగా కూడా అనిపించదు. కానీ మన దేశంలోనే ఒక ప్రత్యేక రైల్లో గణపతికి ఆలయం ఏర్పాటు చేశారు. అంతేకాదు, విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా ఒక బెర్త్ కూడా కేటాయించారు. ఈ విషయం తెలిసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ రైలు ఏది? ఎక్కడ నడుస్తోంది? ఎందుకు రైలులో ఆలయం నిర్మించారు? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది సాధారణ ప్రయాణికుల రైలు కాదు. ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ అనే ప్రత్యేక పర్యాటక రైలు. ఈ రైలు బీహార్ నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బయలుదేరింది. బీహార్‌కు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక స్లీపర్ కోచ్‌ను చిన్న ఆలయంగా మార్చారు. ఆ కోచ్‌లోని సైడ్ అప్పర్ బెర్త్‌పై గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో ఆ కోచ్ పూర్తిగా ఆలయ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఆ స్లీపర్ కోచ్‌లో భజనలు, డప్పుల శబ్దాలు, సామూహిక ప్రార్థనలతో భక్తి పరిమళం వ్యాపిస్తోంది. ఈ యాత్ర సుగౌలి నుంచి ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది స్లీపర్ కోచ్‌లు, ఒక 3ఏసీ కోచ్, ఒక 2ఏసీ కోచ్, ఒక ప్యాంట్రీ కార్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో ఈ రైలు సాగుతోంది. ఈ ప్రయాణంలో మొత్తం 464 మంది యాత్రికులు పాల్గొంటున్నారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గణపతికి హారతులు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరి భక్తి గీతాలు ఆలపిస్తూ యాత్రను మరింత ఆధ్యాత్మికంగా మార్చుతున్నారు. ప్రయాణం మొత్తం గణేశుడిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ యాత్ర జనవరి 18న ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 వరకు కొనసాగుతుంది. మొత్తం 14 రాత్రులు, 15 రోజుల పాటు ఈ తీర్థయాత్ర సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా భక్తులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి జ్యోతిర్లింగం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారి, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం, మల్లికార్జున జ్యోతిర్లింగం, చివరగా పూరి శ్రీ జగన్నాథ్ ధామాన్ని దర్శించనున్నారు.
ఈ పవిత్ర యాత్రకు భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. నాలుగో రోజు తిరుపతిలో శ్రీవారి దర్శనం పూర్తయ్యాక తదుపరి గమ్యస్థానానికి బయలుదేరారు. మొత్తం ప్రయాణం సజావుగా సాగేందుకు రైల్వే అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండగా, టికెట్ ఉన్నవారికే రైల్లోకి అనుమతి ఇస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యానికి అధికారులు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే పరీక్షించేందుకు ఒక సీనియర్ డాక్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
ఈ యాత్రకు సంబంధించిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. స్లీపర్ క్లాస్‌కు ఒక్కొక్కరికి రూ.27,535, 3ఏసీకి రూ.37,500, 2ఏసీకి రూ.51,405గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో హోటల్ వసతి, శాకాహార భోజనం, స్థానిక దర్శనాలు, రవాణా, ఆన్‌బోర్డ్ భద్రత, ప్రయాణ బీమా వంటి సౌకర్యాలు IRCTC అందిస్తోంది. IRCTC అధికారులు కూడా ఈ బృందంతో ప్రయాణిస్తూ, భక్తులకు సురక్షితమైన, స్మరణీయమైన ఆధ్యాత్మిక అనుభవం అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: Gas Cylinder: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది!
VIRAL: రైలులో గణేశుడి ఆలయం.. తెలుసా?
