Tragedy: “ఇదే నా చివరి దీపావళి” — అని ఒక 21 ఏళ్ల యువకుడు రాసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ యువకుడు తన బాధను, మనసులోని ఆవేదనను Redditలో పంచుకున్నాడు.
తన పోస్ట్‌లో అతను ఇలా రాశాడు: “2023లో నాకు పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆ రోజునుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆస్పత్రి గదులే నా ఇల్లు అయ్యాయి. ఎన్నో కీమోథెరపీ సెషన్లు తీసుకున్నాను. ప్రతి సారి నొప్పి భరించలేనిది, కానీ ఆశ మాత్రం వదల్లేదు. అయితే ఇప్పుడు వైద్యులు నాకు స్టేజ్ 4 క్యాన్సర్ అని, ఇంకో ఏడాదికంటే ఎక్కువ బతకడం కష్టమని చెప్పారు.”
ఆయన మరింతగా రాసిన మాటలు చదివినవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. “ఇప్పుడు వీధుల్లో దీపావళి సందడి కనిపిస్తోంది. పిల్లలు పటాసులు పేలుస్తున్నారు, ఇళ్లన్నీ వెలుగులతో మెరిసిపోతున్నాయి. కానీ నాకు ఇవే చివరి వెలుగులు, చివరి నవ్వులు అని అనిపిస్తోంది. నా జీవితం నెమ్మదిగా మసకబారుతోంది. నా కలలు, ఆశలు కరిగిపోతున్నాయి. ఇది నా కుటుంబం ఎదుట జరుగుతుండడం వారికి కూడా తట్టుకోలేని బాధ” అని రాశాడు.
ఈ యువకుడి పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఎంతోమంది నెటిజన్లు ఆయన ధైర్యానికి, మనోధైర్యానికి శభాష్ చెబుతూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనకు మానసిక బలం ఇవ్వడానికి ప్రోత్సాహకరమైన సందేశాలు పంపుతున్నారు. ఈ కథ మనిషి జీవితం ఎంత విలువైనదో, ప్రతి క్షణం ప్రేమతో జీవించాలనే విషయం గుర్తు చేస్తోంది.
