Chicken Rates: మాంసాహార ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇటీవల చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర సుమారు రూ.260 ఉండగా, ఇప్పుడు అది రూ.340 వరకు ఎగబాకింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో చికెన్ రేట్లు కూడా పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
చికెన్ ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడం, రంజాన్ మరియు ఇతర కార్యక్రమాల వల్ల డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. డిమాండ్‌కు సరిపడా చిన్న కోళ్లు అందుబాటులో లేకపోవడం, అలాగే పౌల్ట్రీ యజమానులు పిల్లల పెంపకాన్ని తగ్గించడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. సరఫరా తక్కువగా ఉండటంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఇక మరోవైపు కోడిగుడ్ల ధరలు మాత్రం గణనీయంగా పడిపోయాయి. ఒకప్పుడు ఒక్క గుడ్డు ధర రూ.8 వరకు ఉండగా, ప్రస్తుతం అది సుమారు రూ.4.20కి తగ్గింది. గుడ్ల ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా గుడ్లను తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ ఎగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్‌లో సరఫరా పెరిగి, ధరలు పడిపోయాయి.
