Andhra: విజయవాడలో వంగవీటి కుటుంబ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. నవంబర్ 16 ఉదయం 7 గంటలకు బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి వంగవీటి ఆశా కిరణ్ నివాళులర్పించారు. ఇదే సమయంలో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ దుబాయ్ పర్యటనలో ఉండగా, ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న చర్చలకు మరింత ఆసక్తి పెరిగింది.
ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పాలకొల్లులో వనభోజనాలకు వెళుతున్నానని, ఇప్పుడే రాజకీయల్లోకి వస్తున్నట్టు ఏ ప్రకటన ఇవ్వలేదని స్పష్టంచేశారు. అయితే, రాధా–రంగా మిత్ర మండలిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి బయటికి వచ్చినట్టు తెలిపారు. ఏ పార్టీకి వెళ్లాలి అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
మా ఇద్దరి మార్గాలు వేరు అయినా, లక్ష్యం మాత్రం ఒకటేనని ఆశా కిరణ్ చెప్పారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఇంతకాలం ప్రజల్లోకి రాలేకపోయానని, ఇకపై రంగా అభిమానులతో కలుస్తానని చెప్పారు. ఎవరికైనా అవసరం వచ్చినా, కష్టసమయంలో ఆసరాగా ఉంటానని హామీ ఇచ్చారు. రాధా–రంగా మిత్ర మండలిలో ఉన్న గ్యాప్ తొలగించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
