Tirumala: తిరుమల క్యూలైన్లో గొడవ.. బెల్ట్‌తో కొట్టాడు (VIDEO)

Tirumala: TTD Appeals to deveotees to maintain restraint in queue lines

Tirumala: TTD Appeals to deveotees to maintain restraint in queue lines

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక అసహజ ఘటన చోటుచేసుకుంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోని క్యూలైన్‌లో ఇద్దరు భక్తుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.

వివరాల ప్రకారం, ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఒక భక్తుడు కోపోద్రిక్తుడై బెల్ట్ తీసి మరొకరిపై దాడి చేయడానికి యత్నించాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే స్పందించి ఇద్దరినీ వేరుచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వారి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. క్యూలైన్లలో భక్తులు ఓర్పు, సహనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. “తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో ఇద్దరు భక్తులు సోమవారం ఘర్షణ పడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇలాంటి ఘర్షణలకు దూరంగా ఉండాలి. పరస్పరం స్నేహపూర్వకంగా వ్యవహరించి, క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి” అని టీటీడీ ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు సోమవారంతో పూర్తయ్యాయి. చివరి రోజైన సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పుష్కరిణిలో ఏడు చుట్లు తిరుగుతూ కనువిందు చేశారు.

వేదపండితుల వేదపారాయణం, మంగళవాయిద్యాల నినాదాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read: VIDEO: మహిళ లైవ్‌లో ఉండగా దూసుకొచ్చిన మిస్సైల్

Tirumala: తిరుమల క్యూలైన్లో గొడవ.. బెల్ట్‌తో కొట్టాడు (VIDEO)