Fee Reimbursement: నేటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌

Telangana’s Private Colleges on Indefinite Strike Over Fee Issue From Today

Telangana’s Private Colleges on Indefinite Strike Over Fee Issue From Today

Fee Reimbursement: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు సోమవారం నుండి సమ్మెకు సిద్ధమయ్యాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు అన్ని వృత్తి విద్యా కాలేజీలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. యాజమాన్యాలు సమ్మె సాగిస్తుండడంతో మొత్తం 1,840 కాలేజీలు బంద్‌ కానున్నాయి. దీని ప్రభావం దాదాపు 35 లక్షలకు పైగా విద్యార్థులపై పడనుంది.

గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) ప్రభుత్వాన్ని వరుసగా కోరుతూ వచ్చింది. ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. దీపావళి ముందు రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చినా, అందులో రూ.300 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు అడిగినా స్పందన లేకపోవడంతో, ఫాతీ సమ్మె నోటీసు ఇచ్చింది.

ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫాతీ ప్రతినిధులతో మాట్లాడి, ఇప్పటికైనా రూ.150 కోట్లు విడుదల చేస్తామని, సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే యాజమాన్యాలు దీనిని అంగీకరించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ బాబు ప్రకటించారు. సోమవారం నుండి అన్ని ఉన్నత విద్యాసంస్థలు సమ్మెలో పాల్గొంటాయని, బకాయిలు పూర్తిగా విడుదలయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలను వాయిదా వేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు ఫాతీ విజ్ఞప్తి చేసింది. దీనితో జేఎన్‌టీయూ పరిధిలోని ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు, బీ.ఎడ్‌, డీ.ఎడ్‌ పరీక్షలు, అలాగే అనేక కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్‌ ఇంటర్నల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సంఖ్య ఇలా ఉంది:

  • 800 డిగ్రీ కాలేజీలు

  • 300 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు

  • 215 బీ.ఎడ్ కాలేజీలు

  • 175 ఇంజనీరింగ్ కాలేజీలు

  • 123 ఫార్మసీ కాలేజీలు

  • 100 పాలిటెక్నిక్ కళాశాలలు

  • 70 డైట్ కళాశాలలు

  • 27 ఆర్కిటెక్చర్ కాలేజీలు

  • 30 న్యాయ కళాశాలలు

ఈ సమ్మె పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని సూచనల కోసం అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.

Also Read: ICC Women’s World Cup: దుమ్ము దులిపేశారు.. భారత మహిళల చారిత్రక విజయం!

Fee Reimbursement: నేటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌