Half Day Schools: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ నిబంధనలు మార్చి 16 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు అమల్లో ఉంటాయి.
ఈ నిర్ణయం ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్ డే మీల్స్ అందజేస్తారు. ఈ ఆదేశాలు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది. అలాగే ఎస్సెస్సీ పరీక్షలు జరిగే పాఠశాలల విషయంలో కూడా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఏ పాఠశాలల్లో అయితే SSC పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే, ఆ పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పని చేస్తాయి. అయితే పరీక్షలు లేని సాధారణ రోజుల్లో ఆ పాఠశాలలు కూడా మిగిలిన పాఠశాలల మాదిరిగానే ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులుగానే కొనసాగుతాయి.
ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ నిర్ణయాన్ని పర్యవేక్షించేందుకు ప్రాంతీయ విద్యాధికారులు మరియు జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు పాటించని పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
