Telangana: తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను చట్టబద్ధం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నం.106ను విడుదల చేసింది.
తెలంగాణ భూ భారతీ (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2025 (చట్టం నం.1 ఆఫ్ 2025)లోని సెక్షన్ 6(1) ప్రకారం, ప్రభుత్వం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన సదాబైనామా దరఖాస్తులను పరిశీలించి, ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం లభించనుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, చిన్న మరియు సూక్ష్మ రైతులు వ్యవసాయ భూములపై 12 సంవత్సరాలకు పైగా కబ్జా చేసుకొని, 2024 జూన్ 2 లోపు సంబంధిత ఆధార పత్రాలను కలిగి ఉంటే, వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయని లావాదేవీల ఆధారంగా ఉన్న భూమి హక్కులు ఈ ప్రక్రియ ద్వారా చట్టబద్ధం అవుతాయి. దీని ఫలితంగా రైతులు భూహక్కుల పత్రాలు, పాసుబుక్స్ పొందే అవకాశం ఉందని రేవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది రైతులకు న్యాయం జరగనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న, పేద రైతులు ఇప్పటివరకు భూములపై సాగు చేస్తున్నప్పటికీ, సరైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ చర్య ద్వారా వారికి భూమి హక్కులు స్పష్టమవుతాయి.
ప్రభుత్వం ఈ జి.ఓ.ను గెజిట్లో ప్రచురిస్తూ, జిల్లా కలెక్టర్లు మరియు రేవెన్యూ శాఖ అధికారులు తక్షణమే అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటే, రైతులు చట్టబద్ధమైన భూహక్కులు పొందే మార్గం సుగమం కానుంది.
