Telangana: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొత్త చట్టానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 10 నుంచి 15 శాతం లేదా రూ.10వేల వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా, త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ చట్టం ప్రకారం, బాధితులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్ రికార్డుల్లో తల్లిదండ్రుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, జీతం నుంచి కట్ చేసిన మొత్తాన్ని ఉద్యోగి ప్రమేయం లేకుండా నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులతో పాటు, కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బందికీ ఈ చట్టం వర్తించేలా ముసాయిదా రూపొందించారు. ఒకే తల్లిదండ్రులకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటే, వారి జీతాల నుంచి సమానంగా కోత విధించనున్నారు. అయితే, సొంత ఆదాయం, పెన్షన్ లేదా అద్దె వంటి వనరులు లేకుండా పూర్తిగా పిల్లలపై ఆధారపడే వృద్ధులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను సవరించే అధికారం ఉంది. ఈ అధికారం ఆధారంగానే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే అస్సాం రాష్ట్రం 2017లో ‘ప్రాణమ్’ చట్టం ద్వారా ఇలాంటి విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. అదే నమూనాలో ఈ చట్టాన్ని తీసుకువస్తూ, తల్లిదండ్రులతో పాటు దివ్యాంగ సోదరులను నిర్లక్ష్యం చేసినా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు.
బాధితులు తమ సమస్యలను సంబంధిత శాఖాధిపతి (HOD) లేదా ప్రభుత్వం నియమించిన అధికారికి నేరుగా తెలియజేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి, ఉద్యోగి నిర్లక్ష్యం చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటారు. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తిచేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందే సంస్థల ఉద్యోగులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్-2007’ ద్వారా వృద్ధులకు రక్షణ కల్పించింది. ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి భరణం కోసం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పిల్లలు పాటించకపోతే, అది కోర్టు ధిక్కరణగా పరిగణించబడుతుంది. అయితే, ఈ చట్టంలో ఆటోమేటిక్ జీతం కోత వంటి విధానం లేదు. న్యాయ ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో చాలా మంది వృద్ధులు దీన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.
ఈ లోపాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జీతం నుంచి కోత విధించే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, ట్రెజరీ ద్వారా ఆటోమేటిక్‌గా ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలకు బదిలీ చేస్తారు. దీంతో వృద్ధులకు ఆర్థిక భద్రత కలగడమే కాకుండా, ఉద్యోగుల్లో బాధ్యతాభావం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొన్ని కఠిన నిబంధనలు కూడా పెట్టారు. ముఖ్యంగా, తల్లిదండ్రులకు స్వంత ఆదాయం లేకపోతేనే ఈ ప్రయోజనం వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
