Eluru: పిల్లలకు ప్రేమతో, సహనంతో పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు అతి క్రూరంగా ప్రవర్తించిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న తప్పు కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలకు ముప్పు వాటిల్లేంతగా దారుణంగా కొట్టడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, తంగెళ్లమూడికి చెందిన ఓ బాలుడు శ్రీసరస్వతి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18న తరగతికి హాజరైన అతడు, ఆంగ్ల పాఠంలో డి అక్షరం సరైన విధంగా పలకలేకపోయాడు. దీనిపై ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉదయ్ అదుపు కోల్పోయి, కర్రతో బాలుడి చేతులు, వీపు మీద విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో విద్యార్థి శరీరం అంతా గాయాలతో నిండిపోయింది.

ఈ విషయం శుక్రవారం బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. అయితే తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించడంతో, వారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా కార్యదర్శి కె. లెనిన్ స్పందించారు. విద్యార్థిని ఇంత దారుణంగా దండించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే పాఠశాలలో గతంలోనూ కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను శారీరకంగా హింసించిన ఘటనలు ఉన్నాయని, ఈ విషయంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సంఘటనతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిల్లల భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
