- విశాఖలో పలు చోట్ల భూ ప్రకంపనలు..
- తెల్లవారుజామున 4: 16 గంటల నుంచి 4: 20 గంటల మధ్య భూ ప్రకంపనలు..
- మురళీనగర్, రాంనగర్, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..
- భయంతో బయటకు వచ్చిన పలు కాలనీ వాసులు..
Earthquake: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4:16 నుంచి 4:20 గంటల మధ్య భూమి తేలికగా కంపించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చాలామంది అప్పుడు గాఢ నిద్రలో ఉండగా కంపనాలు రావడంతో, ఇళ్లలో ఉన్న వారు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు పరుగులు తీశారు.
జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) సమాచారం ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో కేంద్ర బిందువు (ఎపిసెంటర్) ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జీ.మాడుగుల ప్రాంతం సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
సుభం ఏమంటే, ఈ ప్రకంపనల వలన ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం చోటుచేసుకోలేదు. దీనితో ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు.
ప్రభావం కనిపించిన ప్రాంతాలు:
-
విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షినగర్, రాంనగర్, మురళీనగర్, అక్కయ్యపాలెం
-
గాజువాక సమీప తీరప్రాంతాలు, భీమ్‌లిపట్నం మండలానికి చెందిన కొన్ని గ్రామాలు
కొంత మంది తమకు అనుభవమైన ప్రకంపనలను మొబైల్ ఫోన్స్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్లపాటు మాత్రమే భూమి కంపించినప్పటికీ, భయం మాత్రం కొంతసేపు ప్రజలలో కనిపించింది.
స్థానిక పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఇది స్వల్ప తీవ్రత గల భూకంపం మాత్రమే కావడంతో, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు స్పష్టంచేశారు.
