Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

RTC bus information on Google Maps!

RTC bus information on Google Maps!

Google Maps: తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో మరింత స్మార్ట్‌గా మారనుంది. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) బస్సుల సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరింత విస్తరించనుంది. ప్రయాణికులు ఇకపై బస్సు గమ్యస్థానం వరకు దూరం, బస్సు ప్రస్తుత స్థానం, రాకపోకల సమయం వంటి వివరాలను సులభంగా తెలుసుకోగలరు. అంతేకాకుండా, క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత డిజిటల్‌ టికెట్లు మరియు బస్‌ పాస్‌లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న “గమ్యం” యాప్‌ ద్వారా బస్సుల రాకపోకల సమాచారం అందిస్తున్నప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ సర్వీసులను మరింత ఖచ్చితంగా అందించేందుకు గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీని కోసం బస్సుల సమగ్ర డేటాను గూగుల్‌కు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, దీపావళి సమయానికి హైదరాబాద్‌ సిటీ బస్సుల సమాచారం గూగుల్ మ్యాప్స్‌లో కనిపించనుంది. తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని బస్సుల వివరాలు అందుబాటులోకి వస్తాయి.

ఇక మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ “మీటికెట్‌” యాప్‌ ద్వారా కూడా టీఎస్‌ఆర్టీసీ సేవలు విస్తరించనున్నాయి. ఈ యాప్‌లో త్వరలోనే ఇంటర్‌సిటీ బస్సు టికెట్లు, నెలవారీ పాస్‌లు, క్యూఆర్‌ ఆధారిత డిజిటల్‌ పాస్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణ, మెట్రో డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, గ్రీన్‌ మెట్రో లగ్జరీ (ఏసీ), పుష్పక్‌ ఎసీ బస్సుల టికెట్లు ఈ యాప్‌లోనే బుక్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ను 1.35 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు, 2.6 లక్షల టికెట్లు బుక్‌ కాగా, రూ.2 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి.

ఇక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం పెంచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న డీజిల్‌ బస్సులను క్రమంగా నగర శివార్లకు పంపి, వాటి స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 265 ఈవీ బస్సులకు మరో 275 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు జత కాబోతున్నాయి. వచ్చే మూడు సంవత్సరాల్లో మొత్తం 2,800 ఈవీ బస్సులు హైదరాబాద్‌లో రోడ్డుపైకి రానున్నాయి.

ఈ బస్సులకు అవసరమైన ఛార్జింగ్‌ వసతులు కల్పించేందుకు అన్ని డిపోలను ఈవీ చార్జింగ్‌ డిపోలుగా మారుస్తున్నారు. ఇందుకోసం హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో డిపో అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భర్తీ చేసేందుకు “గ్రీన్‌ ఫీ” రూపంలో బస్సు టికెట్లపై రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ చర్య ద్వారా ఏడాదికి రూ.110 కోట్లు, రెండు సంవత్సరాల్లో రూ.220 కోట్ల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Alert: బండి నడుపుతూ పాటలు వింటున్నారా?

Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఆర్టీసీ బస్సుల సమాచారం!