Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా పలు కీలక అంశాలపై స్పందించారు. అసెంబ్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, విద్యా వ్యవస్థపై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే +2 విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో కూడా అదే దిశగా మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్పై దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
ఇక ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు. తొందరపడి చర్యలు తీసుకుంటే కోర్టుల్లో టెక్నికల్ కారణాలతో కేసులు కొట్టివేయబడే అవకాశం ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు పూర్తి స్థాయి ఊరట లభించలేదని, అయితే చక్రధర్ గౌడ్ పెట్టిన కేసులో మాత్రం కొంత రిలీఫ్ వచ్చినట్లు వివరించారు.
ప్రభుత్వ హామీల అమలు విషయంలో కూడా స్పష్టత ఇచ్చిన సీఎం, ఏ గ్యారెంటీని ఎప్పుడు అమలు చేయాలో తమ వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం అప్పులు, తప్పులను కప్పిపుచ్చే విధంగా పాలన సాగించిందని విమర్శించారు. తాము అలాంటి పరిస్థితులు రానివ్వబోమని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.3.47 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నామని వెల్లడించారు. అయితే అందులో ఎక్కువ భాగం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే వినియోగించాల్సి వచ్చిందని తెలిపారు. గత 26 నెలల్లో సుమారు రూ.3.3 లక్షల కోట్ల అప్పులను చెల్లించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా భారీగా అప్పులు ఉండటంతో వాటిని తీర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
హిల్టు టిడిఆర్ భూబదిలీ అంశంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విచారణ కోరితే సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన భూములన్నీ అమ్మినా లక్ష కోట్లు కూడా రాకపోవచ్చని, అలాంటప్పుడు ఐదు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ నియామకాలపై మాట్లాడుతూ, మంత్రి అజారుద్దీన్, కోదండరాం నియామకంపై సుప్రీంకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ను సంప్రదిస్తామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలు, మండలాల్లో ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేశారు.
విద్యాశాఖకు సంబంధించిన కమిషన్ ఇచ్చిన నివేదికను కేకే కమిటీకి పంపినట్లు కూడా సీఎం వెల్లడించారు. మొత్తంగా ప్రభుత్వం పలు రంగాల్లో సంస్కరణలు తీసుకురావడానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
