Cricket: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభమైన చిన్న గొడవ చివరకు దారుణ హత్యకు దారి తీసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఒక్క పరుగు విషయంపై మొదలైన వాగ్వాదం ఆ తర్వాత కక్షగా మారి, యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగదిలి ప్రాంతంలో ప్రతి వీకెండ్ యువకులు కలిసి క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం సర్వసాధారణం. ఆదివారం కూడా వినాయకనగర్, చాకలిపేట, పెదగదిలి ప్రాంతాలకు చెందిన మూడు జట్లు సిరీస్ తరహాలో మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి చేరుకున్నాయి. డ్రా ప్రకారం పెదగదిలి జట్టుకు బై పడగా, వినాయకనగర్ మరియు చాకలిపేట జట్లు మ్యాచ్ ఆడాయి.
ఈ మ్యాచ్‌లో డోలా అజిత్ (పెద్ద) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక పరుగు విషయంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్‌గా ఉన్న చిరంజీవి ఈ వివాదాన్ని సర్దిచెప్పాడు. అయితే పక్కన కూర్చొని మ్యాచ్ చూస్తున్న కిట్టు కిశోర్ (బాక్సర్ కిషోర్) అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనిపై అజిత్ స్పందించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. అక్కడున్నవారు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టి వారిని అక్కడి నుంచి పంపించారు.
అయితే ఈ గొడవతో మనసులో కక్ష పెట్టుకున్న కిషోర్, సాయంత్రం తిరిగి పెదగదిలికి వచ్చాడు. అక్కడ యువకులతో మళ్లీ గొడవకు దిగిన అతడు, అజిత్‌పై అకస్మాత్తుగా దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో అజిత్ ఛాతిలో పొడిచాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాగు అనే మరో యువకుడికి కూడా చేతికి గాయమైంది.
తీవ్రంగా గాయపడిన అజిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గాయపడిన నాగును సమీప ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు కిషోర్ ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Also Read: Dhurandhar 2: హిస్టరీ క్రియేట్.. తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు
Cricket: దారుణ హత్యకు దారి తీసిన క్రికెట్ మ్యాచ్
