Telangana: ఫేస్‌బుక్ పరిచయం ద్వారా మొదలైన స్నేహం ప్రేమగా మారి, చివరకు వివాహానికి దారి తీసింది. అయితే పెళ్లి తర్వాత అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌తో పరిచయం ఏర్పడింది. అతను గచ్చిబౌలిలోని ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారడంతో, కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పట్నాలో వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం మియాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు. అయితే పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని సమాచారం. ఈ వేధింపులను భరించలేక బుధవారం ఇషిక తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇషిక తల్లిదండ్రులు తమ కుమార్తెను బంగారం, వజ్రాభరణాలు మరియు అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
