Viral: ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

Man Walks Into Andhra Police Station With Mutton That Won't Cook, Files Bizarre Complaint

Man Walks Into Andhra Police Station With Mutton That Won't Cook, Files Bizarre Complaint

Viral: ఉగాది పర్వదినాన అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు ప్రజలు దొంగతనాలు, గొడవలు వంటి విషయాలపై ఫిర్యాదులు చేయడానికి వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి “సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి” అంటూ కుక్కర్‌తోనే స్టేషన్‌కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, పండుగ సందర్భంగా ఇంటికి బంధువులు వస్తారని భావించి మటన్ కొనుగోలు చేశాడు. ఎంతో ఇష్టంగా వండడం ప్రారంభించిన అతను, మటన్‌ను కుక్కర్‌లో పెట్టి దాదాపు 20 విజిల్స్ వచ్చినా కూడా అది మెత్తబడకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఎంత ప్రయత్నించినా మాంసం ఉడకకపోవడంతో, తాను మోసపోయానని భావించి విక్రేతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అక్కడితో ఆగకుండా, హాజీ నేరుగా కుక్కర్‌ను చేతిలో పట్టుకుని తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులకు కుక్కర్ చూపిస్తూ, “సార్, ఎన్ని విజిల్స్ వేసినా ఈ మటన్ ఉడకడం లేదు. నన్ను మోసం చేసిన మటన్ షాపు యజమానిపై కేసు పెట్టండి” అని ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన చూసిన పోలీసులు, అక్కడ ఉన్న ఇతరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు, తరువాత అతని అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నారు. ఇలాంటి విషయాలపై కేసు నమోదు చేయలేమని, ఇది పోలీస్ కేసు కాదని అతనికి వివరించారు. చివరకు హాజీని శాంతింపజేసి ఇంటికి పంపించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. “తాడిపత్రి చరిత్రలో ఇదే మొదటి కేసు అయి ఉండాలి” అని కొందరు కామెంట్ చేస్తుండగా, “పాపం పండుగ రోజున మటన్ తినలేక బాధపడ్డాడు” అని మరికొందరు చమత్కరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Gold Rates: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..?

Viral: ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..