Indiramma Scheme: బీ అలర్ట్.. ఇలా చేస్తే ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు క్యాన్సిల్!

Indiramma Scheme: Be Alert! If you do this, your allotted Indiramma house will be cancelled

Indiramma Scheme: Be Alert! If you do this, your allotted Indiramma house will be cancelled

Indiramma Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశ అమలు కోసం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను కలుపుకుని ఉన్న క్యూర్‌ పరిధిలో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు.

ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో భూముల గుర్తింపులో పేదల జీవనాధారాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కొందరు అద్దెకు ఇవ్వడం లేదా ఖాళీగా ఉంచడం ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలాంటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి ఏప్రిల్ 30లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించారు. సమాధానం ఇవ్వని వారి కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన వారికి మళ్లీ కేటాయిస్తామని హెచ్చరించారు.

అలాగే 2బీహెచ్‌కే, జవహర్లాల్ నెహ్రు అర్బన్ రెన్యువల్ మిషన్ కింద కేటాయించిన ఇళ్లపై మే 1 నుంచి తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించారు. నోటీసులకు స్పందించిన లబ్ధిదారులు బాండ్ పేపర్‌పై తాము ఆ ఇళ్లలోనే నివసిస్తామని హామీ ఇవ్వాలి. లేకపోతే ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసే అవకాశం ఉంది.

ఇళ్లతో పాటు ప్రాథమిక సౌకర్యాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజ్ వంటి సదుపాయాలను పూర్తిగా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియలో GHMC సహకారం తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 22 వేల ఇళ్లకు విద్యుత్ మీటర్లు తక్షణమే అమర్చాలని ఆదేశించారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ టవర్లను త్వరగా పూర్తి చేసి, సిద్ధమైన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల కాలనీల్లో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లను అద్దెకు ఇవ్వకుండా వేలం ద్వారా విక్రయించి, ఆ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘం మరియు ప్రభుత్వ సంయుక్త ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు.

Also Read: Diabetes: షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..!

Indiramma Scheme: బీ అలర్ట్.. ఇలా చేస్తే ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు క్యాన్సిల్!