Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా రికార్డు కావచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలిగాలుల ప్రభావం వృద్ధులు, చిన్నారులపై ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రులకు చలి సంబంధిత సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వైద్యులు ఉదయం సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే వాతావరణం కొంత భిన్నంగా మారుతోంది. ఏపీఎస్‌డీఎంఏ వివరాల ప్రకారం, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. ప్రస్తుతం అక్కడ రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వర్ష సూచన రావడం వాతావరణంలో వైవిధ్యాన్ని చూపిస్తోంది.
బంగాళాఖాత ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కనిపించింది. మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి నుంచే పలుబాగాల్లో చిరుజల్లులు కురిశాయి. గత కొన్ని రోజులుగా దట్టంగా కమ్ముకున్న పొగమంచు తగ్గినప్పటికీ చలి మాత్రం తగ్గలేదు.
వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చలి, వర్షం కలిసి రాబోయే రోజుల్లో ప్రజల జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి రోజులుగా ఉదయం, సాయంత్రం చలిగాలులు, పొగమంచు కారణంగా పల్లెల్లోనూ, పట్టణాలోనూ సాధారణ జీవనం అంతరాయం కలిగింది. రహదారులపై పొగమంచు ఉండటంతో వాహనదారులు కూడా జాగ్రత్తగా ప్రయాణించడం కనిపిస్తోంది.
