Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు

Harish Rao House Arrest in Hyderabad

Harish Rao House Arrest in Hyderabad

Harish Rao: ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోందని ప్రశ్నిస్తూ, ప్రజలకు ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉందని గుర్తు చేశారు. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిగి పర్యటనకు వెళ్లకుండా తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. కాళ్లాపూర్ వద్ద ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, కానీ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారని చెప్పారు. మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. భూ బాధితులను భయపెడుతున్నారని, బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరైంది కాదని ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుకున్నా కాళ్లాపూర్ తప్పకుండా వెళ్తామని, రైతుల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నిజంగా రైతు పక్షపాతి అయితే టెండర్ పిలిచి కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించాలని హరీశ్‌రావు సూచించారు. భూములపై దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై పని చేయాలని అన్నారు. 22A నిషేధిత జాబితాను పునఃసమీక్షించి వెంటనే ఎత్తివేయాలని, ఇండస్ట్రియల్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వాలని కోరారు.

తెలంగాణ పరిస్థితిని విమర్శిస్తూ, ఇది పిచ్చివాడి చేతిలో రాయి లాంటి పరిస్థితి అయిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు అర్థం కావడం లేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారని, మూసీ పేరుతో కూడా కూల్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని బంధువులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

పచ్చని వ్యవసాయ భూములపై ఎందుకు దృష్టి పెట్టారని సీఎం‌ను ప్రశ్నిస్తూ, ఇది భూసేకరణ కాదు, దళితులు మరియు బలహీన వర్గాలపై దండయాత్ర అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిందని, కానీ ఇప్పుడు ఉన్న భూములనే తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత రెండేళ్లలో ఇండస్ట్రీల పేరుతో 10 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని, ఇంకా 40 వేల ఎకరాలు తీసుకునే ప్రణాళికలు ఉన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. స్పీకర్, సీఎం ప్రజల రక్షకులా లేక భక్షకులా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల భూములను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మొత్తం చూస్తే సీఎం ఆలోచనలు భూముల చుట్టూ తిరుగుతున్నాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Also Read: Pregnancy: ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎంత గ్యాప్ ఉండాలి?

Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు