Andhra: అనంతపురం జిల్లా రాయదుర్గం దగ్గర ఒక విషాద ఘటన జరిగింది. స్నేహితుల దినోత్సవం రోజే ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. టీ.వీరాపురం గ్రామ సమీపంలో ఉన్న దోనగంగమ్మ గుడి వద్ద నీటి కుంటలో పడి శ్వేత (11), మౌనిక (9) అనే బాలికలు మృతి చెందారు. వీరిద్దరూ పక్కపక్క ఇళ్లలో నివసించే స్నేహితులే కావడం తల్లిదండ్రులకు కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే… ఆదివారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లిన సమయంలో శ్వేత ఇంట్లో ఒంటరిగా ఉంది. కాఫీ తాగాలని గ్యాస్ స్టవ్ మీద కాఫీ పెట్టింది. అయితే గిన్నె మాడిపోవడంతో అది నల్లగా మసిపడింది. తల్లిదండ్రులు వస్తే తిడతారన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు పాల్పడింది.
తదుపరి సమాచారం ప్రకారం, నీటి కుంటలోకి వెళ్లే ముందు శ్వేత తన చెల్లితో “దోనగంగమ్మ కుంటలో పడి చనిపోతానని” చెప్పిందట. ఆ సమయంలో తనకు అత్యంత సన్నిహితురాలైన మౌనికను కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి నీటి కుంటకు వెళ్లి, అనంతరం అక్కడే శవాలుగా మారారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలికలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. సమాచారం తెలిసిన స్థానికులు, కుటుంబ సభ్యులు కుంట వద్ద వెతికారు. చివరికి రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరి మృతదేహాలను నీటి కుంటలో గుర్తించి బయటకు తీశారు.
తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
