Crime: తన చెల్లి తనకు నచ్చని వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో అన్న దారుణానికి ఒడిగట్టాడు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. చెల్లి భర్తను నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే — గణేష్ అనే యువకుడు, అంజలీదేవి అనే యువతితో పరిచయం అనంతరం వివాహం చేసుకున్నారు. పెళ్లి చూపుల సమయంలో గణేష్ ఎత్తు తక్కువగా ఉన్నాడని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి వ్యతిరేకించారు. కానీ అంజలీదేవి అతనే కావాలని పట్టుబట్టి అతనితోనే వివాహం చేసుకుంది. దీనిపై ఆమె అన్న దుర్గారావు తీవ్రంగా ఆగ్రహించాడు. అప్పటి నుంచి గణేష్‌పై పగ పెంచుకుని, తరచూ “ఒక రోజు చంపేస్తా” అంటూ బెదిరించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే చివరకు దుర్గారావు తన బెదిరింపును నిజం చేశాడు. గుంటూరులో నడిరోడ్డుపై గణేష్‌ను కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేశాడు. ఈ దారుణ ఘటనను అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోగా రికార్డు చేశారు.
మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడు దుర్గారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
