Ganesh Idol: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే వీధులన్నింటిలోనూ వినాయక చవితి సందడి మొదలైపోయింది. విభిన్న రూపాల్లో అలంకరించిన వినాయక విగ్రహాలు మండపాల్లో కొలువుదీరడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో నిలిచే విశాఖపట్నంలోని గాజువాక ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. గతంలో 117 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి రికార్డు సృష్టించిన గాజువాక, ఈసారి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ్’ పేరుతో లంక గ్రౌండ్‌లో 90 అడుగుల ఎత్తైన గణనాథుడిని సిద్ధం చేస్తున్నారు.
ముంబై, చెన్నై, సూరత్ వంటి నగరాల నుంచి సేకరించిన చీరలతో మహా గణపతిని అందంగా అలంకరిస్తున్నారు. మొదట్లో ఆహార పదార్థాలతో విగ్రహాన్ని రూపొందించాలని భావించిన నిర్వాహకులు, అవి ఎక్కువ రోజులు నిలవవని గ్రహించి చీరలతో తయారీకి నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా టన్ను పసుపు, టన్ను కుంకుమ, టన్ను విభూతి, టన్ను పూలతో స్వామివారికి అభిషేకం చేయనున్నారు. అలాగే నిమజ్జనానికి 5 టన్నుల లడ్డూ ఉపయోగించనున్నారు.
ప్రత్యేకత ఏంటంటే, విగ్రహ నిర్మాణానికి వినియోగించిన చీరలను నిమజ్జనం అనంతరం భక్తులకు పంచిపెట్టనున్నారు. దేశంలో చీరలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది గాజువాకకు గర్వకారణమే కాకుండా, పర్యావరణహిత ఉత్సవాలకు దారితీసే మంచి ఆరంభమని భావిస్తున్నారు.
