Crime: అనుమానం పెనుభూతమై, భార్య ప్రాణాల మీదకు వచ్చిన భర్తను స్థానికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన సంఘటన గుంటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గుంటూరు జీఆర్పీ సీఐ అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం – గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివసించే అంజలి అనే మహిళ పలు ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది.
సుమారు 12 ఏళ్ల క్రితం ఆమె వివాహం ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరరావుతో జరిగింది. అయితే భర్త తరచూ అనుమానం పెంచడంతో అంజలి అతనిపై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ప్రస్తుతం తాడేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.
విడాకులు తీసుకున్నప్పటికీ, కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా అప్పుడప్పుడు భార్యాభర్తలు కలసి ఉండేవారు. కానీ, ఇటీవల మళ్లీ ఇరువురి మధ్య విభేదాలు పెరగడంతో విడివిడిగా జీవించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో, శుక్రవారం ఉదయం తాడేపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద అంజలి కనిపించగా, భర్త రాజేశ్వరరావు మరోసారి అనుమానంతో ఆమెపై రాయితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా, అదే సమయంలో వస్తున్న గూడ్స్ రైలుపై ఆమెను నెట్టి హతమార్చాలని చూశాడు. చివరి బోగీ ఆమె ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడి నేలకుపడింది.
స్థానికులు వెంటనే స్పందించి రాజేశ్వరరావును అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. గాయపడిన అంజలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
