Telangana: 3 నెలల బియ్యం ఒకేసారి.. కారణం ఇదే!

Centre’s 3-month ration plan raises fears of PDS rice diversion

Centre’s 3-month ration plan raises fears of PDS rice diversion

Telangana: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందరికీ ఇవ్వాలని సూచిస్తూ కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మార్చి మొదటి వారంనుంచే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎండలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక తెలంగాణ విషయానికి వస్తే, దేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో కొత్త రేషన్ కార్డులు పెద్దగా ఇవ్వలేదు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు కోటికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నట్లు అధికారిక సమాచారం.

కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను ఇవ్వాలని సూచించడంతో, రాష్ట్రంలో అంత మొత్తంలో బియ్యం నిల్వలు ఉన్నాయా? అలాగే ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయడం సాధ్యమా? అనే అంశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

గతంలో కూడా కేంద్రం ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది వర్షాకాలంలో ఒకే నెలలో మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ సమయంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అధికారులు చెబుతున్నారు.

ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వడం వల్ల రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అలాగే డీలర్లు, హమాలీ కూలీలకు కూడా కొంతవరకు లాభం కలగవచ్చు. కానీ మరోవైపు మూడు నెలల బియ్యాన్ని నిల్వ ఉంచే స్థలం తమ వద్ద లేదని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా ఒక సమస్య ఏమిటంటే, మూడు నెలల రేషన్ తీసుకోవాలంటే ఒక్కో లబ్ధిదారుడు మూడు సార్లు వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్వర్ సమస్యల కారణంగా ఒక కార్డుకు 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. దీంతో గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటే ముందుగా సాంకేతిక సమస్యలు, నిల్వ సమస్యలు, పంపిణీ విధానంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Gold Rates: చవక.. చవక.. అక్కడ భారీగా తగ్గిన బంగారం రేటు

Telangana: 3 నెలల బియ్యం ఒకేసారి.. కారణం ఇదే!