High Court: ‘ఆ అర్చకులకు గర్భాలయంలోకి ఎంట్రీ లేదు’

AP High Court Key Verdict on priests foreign tours

AP High Court Key Verdict on priests foreign tours

High Court: విదేశాలకు వెళ్లిన అర్చకులు దేవాలయాల ప్రధాన గర్భగృహాల్లోకి ప్రవేశించి పూజలు చేయకూడదనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్) జారీ చేసిన సర్క్యులర్‌తో పాటు శృంగేరి శారదా పీఠం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వ్యవహారంపై విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన అర్చకుడు డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజి కోర్టును ఆశ్రయించారు. దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్, అలాగే శృంగేరి పీఠాధిపతి మహాతీర్థ భారతీ స్వాములు 2024 డిసెంబర్ 20న విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ తరపు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదిస్తూ.. విదేశీయానం చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా గర్భగృహాల్లో పూజలు చేయడానికి అనుమతిస్తున్నారని తెలిపారు. ధార్మిక పరిషత్ సర్క్యులర్, శారదా పీఠం మార్గదర్శకాల ప్రకారం అర్చకులు విదేశాలకు వెళ్లడం సాధారణంగా అనుమతించబడదని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లినా తిరిగి వచ్చిన తర్వాత గర్భగృహంలో పూజలు చేయడానికి అనుమతి ఉండదని చెప్పారు. అలాంటి వారు ఆలయం బయట జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని వివరించారు.

శృంగేరి పీఠం మార్గదర్శకాల ప్రకారం, గర్భగృహంలో పూజలు నిర్వహించాలంటే అర్చకులు కఠిన ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి. రోజూ త్రికాల సంధ్యావందనం చేయడం, గురువు ఉపదేశించిన మంత్రాలను జపించడం, వేదాధ్యయనం చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటి నియమాలను కచ్చితంగా అనుసరించాలి. అలాగే సంప్రదాయాలకు విరుద్ధంగా విదేశాలకు వెళ్లడం, ముఖ క్షవరం చేయడం లేదా జుట్టు కత్తిరించుకోవడం చేసినవారు గర్భగృహ పూజలకు అర్హులు కాదని పేర్కొన్నారు.

ఈ విషయంపై దేవాదాయ శాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ, సంబంధిత సర్క్యులర్ మరియు మార్గదర్శకాలను అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు.

Also Read: Beauty Tips: కళ్లకు రోజూ కాటుక పెట్టుకుంటే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా?

High Court: ‘ఆ అర్చకులకు గర్భాలయంలోకి ఎంట్రీ లేదు’