Telangana: చాక్లెట్ ఇస్తానని చెప్పి.. ఆరేళ్ల చిన్నారిపై దారుణం

6-Year-Old Girl Raped and Murdered in Narsingi

6-Year-Old Girl Raped and Murdered in Narsingi

Telangana: హైదరాబాద్‌ శివారు నార్సింగిలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆమెపై లైంగికదాడి చేసి అనంతరం హత్య చేసిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మొదట బంధువుల ఇళ్లలో, పరిచయస్తుల వద్ద వెతికారు. అయినప్పటికీ చిన్నారి జాడ కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా చిన్నారి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. చాక్లెట్ ఆశ చూపించి తానే బాలికను తీసుకెళ్లినట్లు తెలిపాడు. అనంతరం ఆమెపై లైంగికదాడి చేసి, తాను పట్టుబడతానన్న భయంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

నిందితుడు చూపించిన ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒక గంట సమయంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా, అతడిని కోర్టుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ దారుణ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమాయక చిన్నారి ఒక కామాంధుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: Leg Cramps: కాళ్లు గుంజుతున్నాయా.. కారణాలివే..!

Telangana: చాక్లెట్ ఇస్తానని చెప్పి.. ఆరేళ్ల చిన్నారిపై దారుణం