AI Content: ‘AI కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి’

India tightens AI rules: Social media must label deepfakes, remove harmful posts in 3 hrs

India tightens AI rules: Social media must label deepfakes, remove harmful posts in 3 hrs

AI Content: ఏఐ ద్వారా రూపొందే కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీప్‌ఫేక్ వీడియోలు, సింథటిక్ ఆడియోలు, అల్గారిథమిక్‌గా మార్చబడిన చిత్రాలు వంటి ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను తొలిసారిగా స్పష్టమైన నియంత్రణ చట్రం కిందకు తీసుకొస్తూ ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్‌కు సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) సవరణ నియమాలు–2026ను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ అప్‌డేటెడ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు డిజిటల్ ఇంటర్‌మీడియరీస్ సింథటిక్‌గా రూపొందించిన సమాచారాన్ని (SGI) స్పష్టంగా కనిపించేలా లేబుల్ చేయడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల వినియోగదారులు ఏ కంటెంట్ నిజమైనదో, ఏది ఏఐ ద్వారా రూపొందించబడిందో సులభంగా గుర్తించగలుగుతారని కేంద్రం తెలిపింది. అలాగే, ఏఐ కంటెంట్ మూలాన్ని గుర్తించేందుకు నిరంతర మెటాడేటా, ప్రత్యేక ఐడెంటిఫైయర్లు కూడా జోడించాల్సి ఉంటుంది. ఒకసారి లేబుల్ లేదా మెటాడేటా అప్లై చేసిన తర్వాత, వాటిని తొలగించడం లేదా దాచడం వీల్లేదని నిబంధనల్లో స్పష్టం చేసింది.

చట్టవిరుద్ధమైన, అసభ్యమైన లేదా మోసపూరిత ఏఐ కంటెంట్‌ను అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఆటోమేటెడ్ టూల్స్‌ను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ఈ కఠిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి. కంటెంట్ అప్‌లోడ్ చేసే ముందు అది ఏఐ ద్వారా తయారైందా లేదా అనే విషయంపై యూజర్ డిక్లరేషన్ తీసుకోవాలి. ఆ క్లెయిమ్‌లను నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెరిఫికేషన్ టూల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఏదైనా కంటెంట్ ఏఐ జనరేటెడ్‌గా గుర్తించబడితే, అది లైవ్‌కు వెళ్లే ముందు స్పష్టమైన లేబుల్‌తో చూపించాలి.

అక్టోబర్ 2025లో ప్రతిపాదించినట్లుగా, ఏఐ విజువల్స్‌పై స్క్రీన్‌లో కనీసం 10 శాతం కవర్ చేసే వాటర్‌మార్క్ తప్పనిసరి అన్న నిబంధనను కేంద్రం ఈ సవరణల్లో తొలగించింది. ఇండస్ట్రీ గ్రూపులు, ముఖ్యంగా IAMAI వంటి సంస్థలు, ఆ నిబంధన సాంకేతికంగా అమలు చేయడం కష్టమని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ మార్పు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఫిక్స్‌డ్ సైజ్ వాటర్‌మార్క్ కాకపోయినా, కంటెంట్ ఫైనల్ వెర్షన్‌కు స్పష్టమైన లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ సవరణలతో టేక్‌డౌన్ టైమ్‌లైన్స్ కూడా గణనీయంగా తగ్గాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చట్టబద్ధమైన ఆదేశాలపై చర్య తీసుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌లకు ఇప్పుడు కేవలం మూడు గంటల సమయమే ఉంటుంది. గతంలో ఇది 36 గంటలుగా ఉండేది. ఇతర ప్రతిస్పందన గడువులు కూడా 15 రోజుల నుంచి 7 రోజులకు, 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గించబడ్డాయి.

అలాగే, చట్టవిరుద్ధమైన లేదా మోసపూరిత కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే శిక్షలు, పెనాల్టీలపై యూజర్లకు అవగాహన కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వినియోగదారులకు సమాచార సందేశాలు పంపాలని సోషల్ మీడియా సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మార్పులతో ఏఐ కంటెంట్‌పై నియంత్రణ మరింత బలోపేతం కానుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

Also Read: Medaram Jatara: మేడారం హుండీ ఆదాయం ఎన్ని కోట్లంటే?

AI Content: ‘AI కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి’