Summer: మార్చి 1 నుంచి భగ్గుమనే ఎండలు..!

Telangana braces for summer, heatwave likely from March 1

Telangana braces for summer, heatwave likely from March 1

Summer: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అల్పపీడన ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మహారాష్ట్రలోని మాఠ్వాడా ప్రాంతం వరకు వ్యాపించి, వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నాయి.

గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 4.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో అత్యల్పంగా 1.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, శనగ, జొన్న పంటలు నేలకొరిగాయి. గింజలు పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పంట వాలిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శుద్ధి చేసి ఆరబెట్టిన పసుపు గాలివానకు తడిసిపోవడంతో నష్టం వాటిల్లింది.

అయితే శనివారం నుంచి వాతావరణం క్రమంగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటినుంచి ఉక్కపోతలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Also Read: Crime: పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో దారుణం

Summer: మార్చి 1 నుంచి భగ్గుమనే ఎండలు..!