తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పోరుతో ఐపీఎల్ 19వ సీజన్‌కు గ్రాండ్ స్టార్ట్ లభించనుంది.
ఈసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో షెడ్యూల్‌ను రెండు దశల్లో ప్రకటించారు. మొదట మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మ్యాచ్‌ల వివరాలు విడుదల చేశారు. తరువాత ఎన్నికలపై స్పష్టత రావడంతో రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించి, మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తరువాత ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే ప్లే ఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
వారంలో సాధారణ రోజుల్లో మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. శని, ఆదివారాల్లో డబుల్ హెడర్స్ ఉంటాయి. ఆ రోజుల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7:30కి మరో మ్యాచ్ జరుగుతుంది.
ఈ సీజన్లో మ్యాచ్‌లు ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, గువాహటి, లక్నో, న్యూ చండీగఢ్, జైపూర్ వంటి నగరాల్లో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను జియో హాట్ స్టార్ యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్‌గా వీక్షించవచ్చు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి, హర్యానా భాషల్లో కామెంట్రీ అందుబాటులో ఉంటుంది. విదేశాల్లో వీక్షించాలనుకునే వారు విల్లో టీవీ, స్లింగ్ టీవీ, ఫ్యూబో, కయో స్పోర్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌లను చూడవచ్చు.