Shigellosis: కేరళ రాష్ట్రంలో షిజెల్లా బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో ఈ బ్యాక్టీరియా సోకడంతో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. ఆ చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
మొదట ఆమెకు సాధారణ కడుపు సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు భావించారు. కానీ తరువాత పరీక్షల్లో షిజెల్లా బ్యాక్టీరియా సోకినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆ చిన్నారితో సన్నిహితంగా ఉన్న సుమారు 11 మందికి కూడా ఈ బ్యాక్టీరియా సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు చిన్నారులు వివిధ ఆస్పత్రుల్లో పర్యవేక్షణలో ఉన్నారు. అదేవిధంగా వయోవృద్ధులను కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కోజికోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలను తాత్కాలికంగా మూసివేశారు. ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
షిజెల్లా బ్యాక్టీరియా సోకిన వారికి అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిశుభ్రత లోపం, కలుషితమైన నీరు వలన ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Karimnagar: మొన్న భార్య.. ఇప్పుడు భర్త.. ఎస్సైఆత్మహత్య
Shigellosis: దేశంలోకి కొత్త వ్యాధి.. చిన్నారి మృతి!
