Samosa: ఘుమఘుమలాడే వేడివేడి సమోసా చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. చల్లని సాయంత్రాల్లో సమోసా ఎంతోమందికి ఇష్టమైన చిరుతిండి. కానీ తాజాగా అదే సమోసా కోసం ఓ హత్య జరిగింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్టోబర్ 19న సమోసాలపై చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారి దారుణానికి దారితీసింది.
కౌలోదిహరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణంలో సమోసాలు కొనడానికి వెళ్లాడు. అక్కడ ఇతర కస్టమర్లతో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆ వ్యక్తి కొనుగోలు చేసిన సమోసా ప్యాకెట్‌ను వారు లాక్కొని, అతడిపై దాడి చేశారు. పరిస్థితి గమనించిన చంద్రమ్ యాదవ్ అనే గ్రామస్థుడు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి పెద్ద గొడవగా మారింది.
ఈ క్రమంలో దుకాణం యజమాని అయిన ఓ మహిళ కత్తితో చంద్రమ్ యాదవ్ తలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే పాట్నా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.
సమాచారం అందుకున్న భోజ్‌పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందిత మహిళను కొద్దిసేపటికే అరెస్టు చేశారు. సమోసా కోసం మొదలైన చిన్న గొడవ ప్రాణాంతకంగా మారడం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నదా అన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.
