Rape Case: తమిళనాడులో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడుగురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక నెల రోజులుగా బడికి వెళ్లలేదు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు, సహపాఠశాల విద్యార్థినులు విచారించగా సరైన సమాధానం రాలేదు.
దీంతో బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని ప్రశ్నించారు. ఆమె గర్భవతి అయ్యిందని, అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు జిల్లా బాలల భద్రతాధికారులను సంప్రదించారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బర్గూర్ ఆల్ ఉమన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై బర్గూర్ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులైన చిన్నసామి (57), ఆరుముగం (45), ప్రకాశ్ (37)లను మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ అమానుష ఘటనపై సమాజం తీవ్రంగా మండిపడుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.