Shiva Ling: మనందరం శివలింగాన్ని పూజిస్తూ ఉంటాం. కానీ శివలింగాలు ఎంత రకాలు ఉంటాయి? వాటి ప్రత్యేకతలేమిటి? అన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. శివపురాణం ప్రకారం శివలింగాలు మొత్తం అయిదు రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే శివలింగంలోని భాగాల్లో ఒక్కొక్క దేవత స్థానం చేసుకుని ఉంటారని కూడా పురాణాలు వివరించాయి. ఇప్పుడు ఆ అయిదు రకాల లింగాలను పరిశీలించుకుందాం.
1. స్వయంభువు లింగం:
దేవతలు మరియు ఋషులు ప్రార్థించినప్పుడు శివుడు ప్రత్యక్షంగా అనుగ్రహరూపంలో వెలిసిన లింగాన్ని స్వయంభువు లింగం అంటారు. ఇది ఎవరి చేతికీ చెక్కబడని, స్వయంగా ఏర్పడిన పవిత్ర లింగం.
2. బిందు లింగం:
యంత్రాల్లో లేదా ప్రత్యేక తంత్రాలలో చెక్కబడిన లింగాన్ని బిందు లింగం అని పిలుస్తారు.
3. ప్రతిష్ఠ (పౌరుష) లింగం:
దేవతలు, గురువులు లేదా మానవుల ఆధ్వర్యంలో శిల్పులతో తయారుచేసి, మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన లింగాన్ని ప్రతిష్ఠ లింగం అంటారు.
4. చర లింగం:
పాదరసం లేదా లోహాలతో తయారుచేసి, మెడలో ధరించే లింగాలు చర లింగాలుగా పిలవబడతాయి. భక్తులు మరియు గురువులు ఎక్కడికైనా తీసుకెళ్లి వీటిని పూజించుకోవచ్చు.
5. గురు లింగం:
సాక్షాత్తు గురువే లింగస్వరూపంగా ఉండటం గురు లింగం అని అర్థం. ఈశ్వరుడే గురురూపంలో భక్తులకు మార్గదర్శకత్వం ఇస్తాడని భావన.
కలియుగంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు లింగాన్ని ప్రతిష్ఠించాలి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎవరికైనా ప్రతిష్ఠ చేయడం సాధ్యం కాకపోతే, ఇప్పటికే ప్రతిష్ఠించిన లింగాల పూజలకు ధనం సమర్పించడం ఉత్తమమని కూడా సూచిస్తున్నారు.
