Kitchen Tips: ఇంట్లో కొత్తగా ప్రవేశించినప్పుడు పాలు మరిగించి పొంగించడం మన సంప్రదాయంలో ఒక శుభకార్యంగా భావిస్తారు. పాలు పొంగడం శుభానికి సూచికగా చాలా మంది నమ్ముతారు. అయితే కొన్నిసార్లు పాలు పదే పదే పొంగిపోతే కొందరు దాన్ని అపశకునంగా కూడా భావిస్తారు. కానీ శాస్త్రీయంగా చూస్తే పాలు ఎందుకు పొంగుతాయి, నీరు ఎందుకు పొంగదు అన్నదానికి ఒక స్పష్టమైన కారణం ఉంది.
సహజంగా పాలలో కొవ్వు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు పాలలో ఎక్కువ శాతం నీరు కూడా ఉంటుంది. పాలను మరిగించేటప్పుడు అందులోని నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది.
అయితే పాలలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వు వంటి పదార్థాలు వేడి కారణంగా పైభాగంలో ఒక చిక్కని పొరగా ఏర్పడతాయి. ఈ పొర ఆవిరి బయటకు వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటుంది. దీంతో పాత్రలో ఏర్పడిన ఆవిరి బయటకు రావడానికి మార్గం లేక ఒక్కసారిగా ఆ పొరను పైకి నెట్టేస్తుంది. ఈ కారణంగా పాలు ఒక్కసారిగా పైకి ఎగిసి పొంగిపోతాయి.
ఇక నీటిని మరిగించినప్పుడు ఇలా జరగదు. ఎందుకంటే నీటిలో ప్రోటీన్లు లేదా కొవ్వు వంటి పదార్థాలు ఉండవు. కాబట్టి నీరు మరిగేటప్పుడు పైభాగంలో ఎలాంటి పొర ఏర్పడదు. ఆవిరి సులభంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే నీరు మరిగినా పాత్ర నుంచి బయటకు పొంగి రావడం కనిపించదు.
మొత్తానికి చెప్పాలంటే పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు వంటి పదార్థాల వల్లే పైభాగంలో పొర ఏర్పడి ఆవిరి బయటకు రాకపోవడం వల్ల పాలు పొంగుతాయి. ఇదే పాలు పొంగడానికి, నీరు పొంగకపోవడానికి ప్రధాన కారణం.
Also Read: Mobile Recharge Plan: మొబైల్ రీ ఛార్జ్ ప్లాన్ 28 రోజులే ఎందుకంటే..!!
Kitchen Tips: పాలు పొంగుతాయి.. మరి నీళ్లెందుకు పొంగవు..??
