Cancer: క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. అయితే ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని ముందస్తు లక్షణాలను గుర్తుంచుకోవడానికి వైద్యులు “CAUTION” అనే సూత్రాన్ని సూచిస్తున్నారు. శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం.
మల, మూత్ర విసర్జనలో మార్పులు:
మూడునుంచి నాలుగు వారాలకు పైగా మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన మలబద్ధకం, మలంలో రక్తం లేదా చీము పడటం, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఇవి కొన్నిసార్లు స్టోన్స్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. కానీ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.
మానని పుండ్లు:
శరీరంలో ఎక్కడైనా రెండు మూడు వారాలు అయినా మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నాలుక కరవడం లేదా చిన్న గాయాలు సాధారణంగా కొన్ని రోజుల్లో మానిపోతాయి. కానీ ఎక్కువ కాలం అలాగే ఉంటే అది క్యాన్సర్‌కు సూచన కావచ్చు.
అసాధారణ రక్తస్రావం లేదా స్రావాలు:
అసాధారణ యోని రక్తస్రావం, మలద్వారం నుంచి రక్తం రావడం లేదా అసాధారణ తెల్లబట్ట వంటి సమస్యలు కూడా క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వచ్చే రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గర్భాశయ క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన సూచన కావచ్చు.
శరీరంలో గడ్డ లేదా కంతి:
శరీరంలో కొత్తగా గడ్డ లేదా కంతి కనిపించి, అది నొప్పి లేకపోయినా క్రమంగా పెద్దదవుతుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో యువతుల్లో కనిపించే పాల గడ్డలు సాధారణమైనవే కావచ్చు. అయినప్పటికీ అది క్యాన్సర్ కణితి కాదని నిర్ధారించుకోవడం అవసరం.
అజీర్తి లేదా మింగడంలో ఇబ్బంది:
ఆహారం మింగడంలో ఇబ్బంది, ముఖ్యంగా ఘన ఆహారం మింగలేకపోవడం, నీళ్లు లేకుండా గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. ఇవి అన్నవాహిక సన్నబడటానికి లేదా అన్నవాహిక క్యాన్సర్‌కు సూచన కావచ్చు.
పుట్టుమచ్చల్లో మార్పులు:
పుట్టుమచ్చ సైజు పెరగడం, దురదగా ఉండటం లేదా రక్తం రావడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలాంటి మార్పులు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
దీర్ఘకాలిక దగ్గు:
ఆరు వారాలకు పైగా మానని దగ్గు లేదా గొంతు బొంగురుగా ఉండటం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల దగ్గు వస్తుంది. కానీ ఎక్కువకాలం కొనసాగితే కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు సూచన కావచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, శరీరంలో ఇలాంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని చిన్న సమస్యగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌ను సమర్థంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది.
Also Read: Health Tips: ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..
Cancer: క్యాన్సర్ కు ముందుగా కనిపించే లక్షణాలు ఇవే..!
