Sleep: రాత్రి 7–8 గంటలు బాగా నిద్రపోయినప్పటికీ, ఉదయం లేవగానే కొంతమందికి బద్ధకం, చిరాకు, నీరసం కనిపిస్తాయి. రోజంతా కూడా అలసటతోనే గడుస్తుంది. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ నిపుణుల ప్రకారం సమస్య నిద్రపోయిన గంటల సంఖ్యలో కాదు, నిద్ర నాణ్యతలో ఉంటుంది.
నిద్ర వైద్యంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ నిపుణుడు డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ ఈ విషయంపై కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆయన ప్రకారం సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోయిన తర్వాత ఉదయం లేవగానే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉండాలి.
చాలామంది చేసే ప్రధాన పొరపాటు ఏమిటంటే గంటల లెక్క మాత్రమే చూసుకోవడం. “ఎక్కువ గంటలు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యమైనది” అని డాక్టర్ అలెన్ చెబుతున్నారు. ఉదాహరణకు మీరు 8 గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా ఉండటం, నోరు పొడిబారటం లేదా తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ నిద్రలో ఏదో సమస్య ఉందని అర్థం.
నిద్రలో శరీరానికి పూర్తిగా విశ్రాంతి లభించాలి. అప్పుడు మాత్రమే మెదడు, శరీరం రెండూ పునరుత్తేజం పొందుతాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా జీవనశైలి అలవాట్లు నిద్ర నాణ్యతను తగ్గిస్తాయి. ముఖ్యంగా స్లీప్ అప్నియా అనే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాసకు అంతరాయం కలుగుతుంది. బయటకు చూస్తే వారు నిద్రపోతున్నట్లే కనిపించినా, మెదడుకు సరైన ఆక్సిజన్ అందక మధ్యలో మెలకువలు వస్తుంటాయి. దీంతో గాఢ నిద్ర దెబ్బతింటుంది.
అదే విధంగా పడుకునే ముందు ఎక్కువసేపు ఫోన్, టీవీ లేదా ఇతర స్క్రీన్లు చూడటం కూడా నిద్రకు హానికరం. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నిద్ర సరైన విధంగా పట్టదు.
మీ నిద్ర నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ అలెన్ కొన్ని సూచనలు చేస్తున్నారు. మీరు గురక పెడుతున్నారా లేదా నిద్రలో శ్వాసలో ఇబ్బంది కలుగుతోందా అనే విషయాన్ని మీతో ఉన్నవారిని అడిగి తెలుసుకోవచ్చు. గురక అనేది చాలా సందర్భాల్లో స్లీప్ అప్నియాకి మొదటి సంకేతం కావచ్చు. ఒంటరిగా నిద్రించే వారు అయితే స్మార్ట్ఫోన్లో ఉన్న స్లీప్ ట్రాకింగ్ యాప్ల ద్వారా నిద్ర సరళిని గమనించవచ్చు.
నిద్ర నాణ్యత మెరుగుపరచుకోవాలంటే రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేయాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం మంచిది. వారాంతాల్లో కూడా ఇదే అలవాటు కొనసాగిస్తే శరీరానికి ఒక స్థిరమైన జీవనలయ ఏర్పడుతుంది.
పడుకునే ముందు కనీసం ఒక గంట పాటు ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా పెట్టాలి. సాయంత్రం సమయంలో కెఫిన్ ఉన్న కాఫీ, టీ తక్కువగా తీసుకోవడం మంచిది. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం కూడా నిద్రకు సహాయపడుతుంది.
అలాగే పడుకునే గది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు పుస్తకాలు చదవడం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వంటి అలవాట్లు కూడా మంచి నిద్రకు ఉపయోగపడతాయి.
ఈ మార్పులు చేసిన తర్వాత కూడా సమస్య కొనసాగితే సొంతంగా మందులు వాడకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే నాణ్యమైన నిద్రే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది.
