Coffee: వేడి వేడి కాఫీతో రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అలసటగా ఉన్నప్పుడు లేదా పని ఒత్తిడి పెరిగినప్పుడు కాఫీ తాగితే తేలికగా అనిపిస్తుందని భావిస్తారు. అయితే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగితే పేగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాక ఆకలి తగ్గిపోవడం వల్ల జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. కాఫీ లేదా టీ పరగడుపున తీసుకుంటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా ఇదే అలవాటు కొనసాగితే అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాఫీ తాగడం వల్ల శరీరంలోని సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావంగా బరువు పెరగడం, అధిక రక్తపోటు, అలసట, కండరాల బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు.
అలాగే నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం వల్ల కొంతమందిలో ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఉంది. శరీరంలో కెఫిన్ ఎక్కువైతే నిద్రలేమి, తలనొప్పి, వికారం వంటి సమస్యలు కూడా కలుగుతాయి.
అయితే కాఫీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో తాగడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేచిన తర్వాత కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల తరువాత కాఫీ తాగడం మంచిది. అంతవరకు తేలికపాటి ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి అలవాట్లు మార్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
