Osteoarthritis: ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారికి కూర్చోవడం, నిలబడడం, నడవడం వంటి సాధారణ పనులే కష్టంగా మారుతాయి. సాధారణంగా ఎముకలు బలహీనపడటం, కీళ్లలో గట్టిదనం తగ్గడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా కీళ్లలో వాపు, మోకాలు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత నడవడం లేదా కదలికల్లో ఇబ్బంది కలుగుతుంది. ఈ మార్పులు సాధారణంగా 2 నుంచి 5 సంవత్సరాల కాలంలో క్రమంగా పెరుగుతాయి.
మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు
అధిక బరువు లేదా ఊబకాయం మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణం. అలాగే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి:
-
సరైన వ్యాయామం లేకపోవడం
-
ఎక్కువసేపు నిలబడి ఉండడం లేదా మోకాళ్లపై కూర్చోవడం
-
శరీరంలో విటమిన్ D3 లోపం
-
కీళ్లపై అధిక ఒత్తిడి పడటం, గాయాలు లేదా బెణుకులు
-
ఆర్థరైటిస్, గౌట్ వంటి కీళ్ల వ్యాధులు
మోకాళ్ల నొప్పి తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారం
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
-
రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి
-
పాలిష్ చేసిన తెల్ల బియ్యం, బేకరీ పదార్థాలు, వేపుడు పదార్థాలు, ఎక్కువ పంచదార వాడకం తగ్గించాలి
-
టీ, కాఫీ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవాలి
-
అధిక కొవ్వు ఉన్న మాంసాహారాన్ని తగ్గించాలి
-
ఒమేగా–3 ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు తీసుకోవడం మంచిది
మోకాళ్ల నొప్పి నివారణకు జాగ్రత్తలు
-
శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి
-
సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలి
-
వైద్యులు సూచించిన వ్యాయామాలు చేయాలి
-
ఉదయం సూర్యరశ్మి శరీరానికి అందేలా చూడాలి
-
స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం మంచిది
-
మెట్లు ఎక్కువగా ఎక్కడం, ఎత్తైన ప్రదేశాల్లో నడవడం తగ్గించాలి
-
బరువులు ఎత్తడం వంటి పనులను నివారించాలి
-
డాక్టర్ సూచించని మందులను స్వయంగా వాడకూడదు
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
సాధారణంగా మోకాళ్ల నొప్పి శారీరక ఒత్తిడి వల్ల ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ మోకాళ్లలో వాపు, నడిచేటప్పుడు తీవ్ర నొప్పి, మెట్లు ఎక్కలేకపోవడం, ఎక్కువసేపు నడవలేకపోవడం లేదా కాళ్లు వంకరగా మారడం వంటి సమస్యలు కొన్ని రోజులు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మోకాళ్ల నొప్పికి అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు
ప్రస్తుతం మోకాళ్ల సమస్యలకు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
PRP థెరపీ: రోగి రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాను తీసుకుని మళ్లీ కీళ్లలో ఇంజెక్ట్ చేసే విధానం.
స్టెమ్ సెల్ థెరపీ: శరీరంలోని మూలకణాలను సేకరించి కీళ్ల సమస్యలను తగ్గించే చికిత్స.
కార్టిలేజ్ మార్పిడి: దెబ్బతిన్న మృదులాస్థిని పునరుద్ధరించే పద్ధతి.
రోబోటిక్ సర్జరీ: మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో అత్యాధునిక సాంకేతికత. ఇది ఎక్కువ ఖచ్చితత్వంతో మరియు భద్రతతో జరుగుతుంది.
పాక్షిక మోకాలి మార్పిడి (UKR): కీళ్లలో దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే మార్చే విధానం. దీంతో నొప్పి తగ్గి మంచి ఫలితాలు పొందవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, మోకాళ్ల నొప్పులను తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం లేకుండా సమస్యను నియంత్రించవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం పాటించడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read: Kitchen Tips: పాలు పొంగుతాయి.. మరి నీళ్లెందుకు పొంగవు..??
Osteoarthritis: మోకాళ్ళు ఎందుకు అరుగుతాయంటే..
