Lunar Eclipse: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి తొలి వారంలో సంభవించనుంది. తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 3, మంగళవారం రోజున కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఇది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున, సింహరాశిలోని పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ నేపథ్యంలో గ్రహణ సమయాలు, దర్శన వ్యవధి, పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం.
చంద్రగ్రహణ సమయాలు
-
ప్రారంభం: మధ్యాహ్నం 3:21 గంటలకు
-
ముగింపు: సాయంత్రం 6:48 గంటలకు
-
మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు
మన దేశంలో గ్రహణం ప్రారంభ సమయానికి చంద్రోదయం ఉండదు. గ్రహణం ముగిసే సమయానికి చంద్రుడు ఉదయిస్తాడు. అందుకే దీనిని “గ్రస్తోదయ చంద్రగ్రహణం” అని అంటారు. చంద్రోదయం తర్వాత మాత్రమే గ్రహణం దర్శనమివ్వడం వల్ల భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇది సుమారు 25 నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య భారత ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించవచ్చు.
ఆలయాల మూసివేత
గ్రహణకాలంలో శాస్త్రోక్తంగా కొన్ని నియమాలు పాటిస్తారు. పలు ప్రధాన దేవాలయాలు ఈ సమయంలో మూసివేయబడతాయి. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తామని ప్రకటించారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాలను తిరిగి తెరవనున్నారు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు
-
గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిదని సంప్రదాయం చెబుతుంది.
-
మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం ముగించుకోవాలి.
-
ఇంట్లో ఉన్న ఊరగాయలు, పచ్చళ్లపై దర్భలు ఉంచడం శ్రేయస్కరం.
-
గ్రహణానికి ముందు మరియు తరువాత పట్టు, విడుపు స్నానాలు చేయాలి.
-
గ్రహణం విడిచే సమయంలో సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదమని భావిస్తారు.
-
రాత్రి 7:30 తర్వాత స్నానం చేసి దైవారాధన చేసి భోజనం చేయవచ్చు.
ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో జరుగుతున్నందున సింహరాశి వారు గ్రహణాన్ని నేరుగా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రకిరణాలు తగలకుండా ఇంట్లోనే ఉండడం మంచిదని అంటున్నారు.
గ్రహణ పరిహారాలు
సింహ, కర్కాటక, మకర, కుంభ రాశుల వారు గ్రహణం మరుసటి రోజు ఆలయానికి వెళ్లి తెల్లని వస్త్రంపై బియ్యం పోసి, దానిపై వెండి చంద్రబింబం ఉంచి, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం చేయడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఇతర రాశుల వారికి ఈ గ్రహణం సాధారణ లేదా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.
దైవారాధనకు ప్రాధాన్యం
గ్రహణ సమయాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దుర్గాదేవిని స్మరించడం, పంచాక్షరీ మంత్రం జపించడం విశేష పుణ్యఫలితాన్ని ఇస్తుందని శాస్త్రోక్తంగా చెబుతారు. అందువల్ల గ్రహణాన్ని భయపడకుండా, భక్తితో ఆచరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా అందించడమైనది. పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ప్రచురించడమైనది. కానీ దీన్ని తెలుగుపోస్ట్.కామ్ ధృవీకరించదు.
