Lifestyle: శృంగార జీవితం గురించి చాలా దంపతులకు అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎప్పుడు కలుగుతారు? ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలి? వంటి ప్రశ్నలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ విషయాల్లో సరైన అవగాహన ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
వివాహం అయిన వెంటనే చాలా మంది దంపతులు సంతానం కోసం ప్రయత్నిస్తారు. అయితే కొంతమందికి వెంటనే ఫలితం రాకపోవడంతో ఆందోళనకు గురవుతారు. ఆస్పత్రులకు వెళ్లినా, ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయాన్ని గుర్తించి శృంగారంలో పాల్గొనడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళలలో నెలసరి పూర్తయ్యాక సుమారు 12 నుంచి 16 రోజుల మధ్య అండం విడుదల అవుతుంది. దీనిని ‘ఓవ్యులేషన్ పీరియడ్’ అంటారు. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, అండం విడుదలకు 4-5 రోజుల ముందు నుంచే శృంగారం జరిగితే కూడా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే శుక్రకణాలు కొన్ని రోజులు శరీరంలో జీవించి ఉండగలవు.
కేవలం సమయమే కాదు, కొన్ని అలవాట్లు కూడా పాటించడం అవసరం. శృంగారం జరిగిన వెంటనే మహిళలు వెంటనే లేచి శుభ్రపరుచుకోవడం లేదా మూత్ర విసర్జనకు వెళ్లడం కంటే, కొంతసేపు అలాగే ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది గర్భధారణ అవకాశాలను కొంతవరకు పెంచుతుంది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఒత్తిడి. చాలా మంది దంపతులు పిల్లలు కలగకపోతే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కానీ ఇలా టెన్షన్ పడటం వల్ల ఫలితం రాకపోవచ్చు. అందుకే ప్రశాంతంగా ఉండటం, శృంగారాన్ని ఆస్వాదించడం అవసరం. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి, శరీరం సహజ స్థితిలో పనిచేస్తుంది.
దంపతులు కేవలం సంతానం కోసం మాత్రమే కాకుండా, తమ మధ్య బంధాన్ని బలపర్చుకునేలా శృంగారాన్ని ఆనందంగా గడపాలి. పరస్పర అవగాహన, సంతోషం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి.
మొత్తానికి, అండం విడుదలయ్యే సమయంలో శృంగారంలో పాల్గొనడం గర్భధారణకు అనుకూలంగా ఉంటుంది. సరైన సమయం, సరైన అవగాహన, మానసిక ప్రశాంతత ఉంటే సంతానం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
