Chickengunya: చికెన్‌గున్యా అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఇది వచ్చినప్పుడు జ్వరం, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి మనం సులభంగా రక్షణ పొందవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దోమలు పెరగకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.
మొదటగా, ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. నీరు నిల్వ ఉండే పాత్రలు, ట్యాంకులు, బకెట్లు వంటి వాటిని ఎప్పుడూ బాగా మూతపెట్టాలి. స్టోర్ చేసిన నీటిని తరచూ మార్చుతూ, అవసరమైతే ఫిల్టర్ చేయడం మంచిది. అలాగే ఏసీ ట్రేలు, ఫ్రిజ్ ట్రేలు లేదా పూల కుండీల్లో చేరే నీటిని తరచూ తొలగించాలి. వాటర్ కంటైనర్లను శుభ్రంగా ఉంచడం వల్ల దోమలు గుడ్లు పెట్టే అవకాశం తగ్గుతుంది.
వ్యక్తిగత రక్షణ కూడా అంతే ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు శరీరం ఎక్కువ భాగం కప్పేలా వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. సాయంత్రం, రాత్రి సమయంలో దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, ఆ సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కిటికీలు, తలుపులకు మెష్ లేదా నెట్ అమర్చుకోవడం ఉపయోగపడుతుంది. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడితే మరింత రక్షణ ఉంటుంది.
ఇలా చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే దోమల పెరుగుదల తగ్గి, చికెన్‌గున్యా వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. కుటుంబ సభ్యులందరూ ఈ జాగ్రత్తలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.
Chickengunya: చికెన్‌గున్యా రావొద్దంటే..