Cancer: నైట్‌ షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు

Can Working Night Shifts Cause Cancer?

Can Working Night Shifts Cause Cancer?

Cancer: రాత్రిపూట ఉద్యోగాలు చేసే మహిళల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. చైనాలోని సించువాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలంగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళల ఆరోగ్యంపై దీని ప్రభావాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ అధ్యయనంలో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలకు చెందిన సుమారు 39 లక్షల మందికి పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించారు. వీరిలో 1,14,628 మంది కేన్సర్ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను ఆధారంగా తీసుకుని రాత్రి పూట పనివేళల ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

పరిశోధన ప్రకారం, ఇతరులతో పోలిస్తే రాత్రిపూట పనిచేసే మహిళల్లో కేన్సర్ ముప్పు సుమారు 19 శాతం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చర్మ కేన్సర్ కేసులు 41 శాతం వరకు అధికంగా ఉండగా, 32 శాతం మంది రొమ్ము కేన్సర్, 18 శాతం మంది జీర్ణాశయ కేన్సర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. రొమ్ము కేన్సర్ ముప్పు ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఐదేళ్లకు పైగా నిరంతరం నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళల్లో రొమ్ము కేన్సర్ ప్రమాదం 3.3 శాతం వరకు పెరుగుతుందని నివేదిక చెబుతోంది.

అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం, అక్కడ సుమారు 15 మిలియన్ల మంది ఉద్యోగుల పనివేళలు సక్రమంగా లేవు. రాత్రిపూట పనిచేయడం వల్ల మన శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్)లో మార్పులు వస్తాయి. ఇది శరీరంలోని మానసిక, శారీరక ప్రక్రియలను నియంత్రించే ముఖ్యమైన వ్యవస్థ. వెలుగు, చీకటి మార్పులకు అనుగుణంగా పనిచేసే ఈ వ్యవస్థ దెబ్బతింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అందువల్ల, నిరంతరం నైట్ షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్‌లతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Gmail: జీమెయిల్ ఐడీకి తోకలు.. గుడ్‌న్యూస్ చెప్పిన పిచాయ్

Cancer: నైట్‌ షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు