Govt Jobs: పోలీస్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగాలు

Telangana Police Recruitment 2026 To Be Announced for 17000 SI & Constable Vacancies

Telangana Police Recruitment 2026 To Be Announced for 17000 SI & Constable Vacancies

Govt Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పోలీసు శాఖ నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే భారీ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు విభాగంలో ఖాళీలు పెరుగుతుండటంతో వాటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా పోలీస్ నియామకాలు క్రమం తప్పకుండా నిర్వహించారు. 2015లో సుమారు 18 వేల పోస్టులు, 2018లో 18,428 పోస్టులు, 2022లో 15,644 పోస్టులను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేశారు. అయినప్పటికీ పదవీ విరమణలు ఎక్కువగా ఉండటంతో ఖాళీల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 2026 ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో దాదాపు 17 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ప్రస్తుతం పోలీసు శాఖలో మొత్తం పోస్టుల సంఖ్య 95,361 కాగా, అందులో 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం సగటున ఆరు నుంచి ఏడు వేల మంది పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఖాళీలు మరింతగా పెరుగుతున్నాయి.

పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఇతర ఉద్యోగాల కంటే కాస్త క్లిష్టంగా ఉంటుంది. అభ్యర్థులకు రాత పరీక్షలతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించాలి. సాధారణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి, తరువాత ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఏడాది వరకు సమయం పడుతుంది. అదనంగా న్యాయ వివాదాలు లేదా ఇతర కారణాలు ఎదురైతే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.

అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులకు చివరగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల నుంచి శిక్షణ పూర్తి అయ్యే వరకు మొత్తం ప్రక్రియకు దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక ఏడాది ఆలస్యం జరిగినా పోలీసు శాఖలో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పోలీసు శాఖ ప్రభుత్వం వద్ద అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే త్వరలోనే భారీ స్థాయిలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతలో ఆశలు పెరిగాయి.

Also Read: Horoscope: మిథున రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందంటే..

Govt Jobs: పోలీస్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగాలు