Mrunal Thakur: పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి దశలో పలు టెలివిజన్ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె, అనంతరం హిందీ సినిమాల్లో కథానాయికగా వరుస అవకాశాలు అందుకున్నారు. ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించి, ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో, ఇటీవల సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హీరోయిన్ బిపాసా బసు అందం, ఫిట్నెస్‌పై మృణాల్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో బిపాసా కంటే తానే ఎంతో అందంగా ఉంటానని, ఆమె కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని వ్యాఖ్యానించిన మృణాల్ మాటలు ఇప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిపాసా సైతం పరొక్షంగా స్పందించారు.
View this post on Instagram
దీనిపై తాజాగా మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు కోరారు. “19 ఏళ్ల వయసులో తెలివితక్కువగా, సరదాగా అందంపై చేసిన వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని అనుకోలేదు. ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదు. అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సరదా ఇంటర్వ్యూ మాత్రమే. కానీ ఇప్పుడు అలా మాట్లాడకూడదని గ్రహిస్తున్నాను. కాలక్రమంలో అందానికి నిజమైన అర్థం తెలిసింది — మనసుతో చూస్తే ప్రతిదానిలోనూ సౌందర్యం ఉంటుంది” అని తెలిపారు.
